పేజీలు

19.5.23

అనుదిన ఆత్మీయ ఆహారం, యోహను 16: 23-28

 యోహను 16: 23-28 

 సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. "నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని , తండ్రిని గురించి దృష్టాంతములతొగాక , తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును . నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" అని పలికెను. 

"మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును".  యేసు ప్రభువు మీరు నా పేరిట ఏమి అడిగినను మీకు ఇచ్చును అని చెబుతున్నారు. ఎందుకు  మనం యేసు ప్రభువు పేరిట ప్రార్ధన చేస్తాము అంటే యేసు ప్రభువు మనకు ఈరోజు సువిశేషంలో చెబుతున్నారు. మీరు  తండ్రిని నా పేరిట ఏమి  అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తారు అని చెబుతున్నారు.  యేసు ప్రభువు తాను ఏ  అధ్బుతం చేసిన మొదట తండ్రికి ప్రార్దన చేసేవారు. ప్రార్దన అనేది తండ్రి దేవునితో మానవుడు ఒక గొప్ప  సంబంధం ఏర్పరుచుకునే సాధనం.  యేసు ప్రభువు ఈ లోకమునకు రాక మునుపు తన తండ్రితో తనకు ఉన్న బంధం, అలానే కొనసాగించినది ఈ ప్రార్దన అనే సాధనం ద్వారం. మనం కూడా యేసు ప్రభువు వలె తండ్రి తో బంధం ఏర్పరుచుకోవాలి. అది ఏర్పరుచుకోవాలంటే ప్రార్ధించాలి.  తండ్రితో యేసు ప్రభువుకు ఉన్న బంధం వల్ల ఆయన  ఏమి అడిగిన అది జరిగింది. మన జీవితంలో యేసు ప్రభువు వలె జీవిస్తే , మనం ఏమి అడిగిన అది జరుగుతుంది. మనం చేసే ప్రార్దన యేసు ప్రభువు పేరిట చేయడం అంటే ఆయనలా చేయడం, జీవించడం . 

"ఇంత వరకు నా పేరిట మీరు ఏమి అడుగలేదు" - ఎందుకు యేసు ప్రభువు మీరు ఇంత వరకు నా పేరిట ఏమి అడుగలేదు అని అంటున్నారు ? అంటే యేసు ప్రభువు శిష్యులుకు  ఇంత వరకు ఏమి అడిగే  అవసరం రాలేదు. శిష్యులకు తండ్రికి , కుమారునికి మధ్య ఉన్న ఐక్యత పూర్తిగా  తెలియదు. శిష్యులు ప్రభువుని ప్రార్దన నేర్పమని అడిగినప్పుడు ప్రభువు వారికి పరలోక ప్రార్దన నేర్పుతున్నారు. శిష్యులు ఈ సమయంలో తండ్రికి మరియు కుమారునికి మధ్య గల బంధం గురించి తెలుసుకుంటున్నారు. వారు ఇద్దరు ఎంతో  ఐక్యమై ఉన్నారు.   ఒక సారి మనకు తండ్రి మరియు కుమారుని మధ్య గల బంధం తెలిసినట్లయితే మనం  చేసే ప్రార్ధన ఎల్లప్పుడు ఆయన పేరు మీద చేస్తాము. ఎందుకంటే తండ్రికి కుమారుడు అంటే అంత ప్రేమ. మరియు కుమారునికి తండ్రి అంటే అంతే ప్రేమ. తండ్రి కోసం కుమారుడు  ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. 

 "మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును" ఇక్కడ మనం కుమారుడంటే తండ్రికి ఎంత ప్రేమో తెలియ జేస్తున్నారు. మనం ఆయన పేరిట ప్రార్దన చేసినప్పుడు , యేసు ప్రభువు మన కోసం తండ్రిని అడుగుతాను అని చెప్పటం లేదు. కాని కుమారుడంటే తండ్రికి ఇష్టం కనుక , కుమారున్నీ ప్రేమించిన వారిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు. మరియు వారికి కావలసినవి మొత్తం తండ్రి సమకురుస్తారు. ఇక్కడ యేసు ప్రభువును నమ్మడం, లేక విశ్వసించడం ముఖ్యం , ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వారు యేసు ప్రభువును విశ్వసించలేదు.శిష్యులు కొన్ని సార్లు యేసు ప్రభువును విడనాడి ఉండవచ్చు కాని వారు ఆయన్ను ప్రేమించారు. ఆయనను తమ గురువుగా అభిమానించారు.  శిష్యులు చేసిన మంచి పని ఏమిటి అంటే ఆయనను విశ్వసించడం,ప్రేమించడం. మనము కూడా ఆయనను విశ్వసించమని, మరియు ప్రేమించమని, ఆయన శిష్యులు అవ్వమని   ఇది  ఒక ఆహ్వానం. 

"నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను"  యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఈ చివరి సందేశంలో తాను ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడకు వెళుతున్నది  అని తెలియచేస్తున్నారు. తన యొక్క మహిమాన్వత స్థానానికి మరల వెళుతున్నారు.  ఈలోకంలో తన యొక్క పనిని పూర్తి చేసుకున్నాడు. తాను వెళ్ళేముందు తన శిష్యులు ఏవిధంగా సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే ఏమి చేయాలో ప్రభువు చెబుతున్నారు. మన సంతోషం సంపూర్ణంగా ఉండాలంటే మనం యేసు ప్రభువు వలె జీవించాలి. యేసు ప్రభువు పేరిట ప్రార్ధించాలి. యేసు ప్రభువు వలె దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. యేసు ప్రభువును ప్రేమించాలి, మరియు ఆయనను విశ్వసించాలి. అప్పుడు మనం తండ్రి చేత ప్రేమించబడుతాం. తండ్రి చేత అన్నీ సమకూర్చబడుతాం. మరియు సంపూర్ణ సంతోషం పొందుతాం. 

ప్రార్ధన :  ప్రభువా! ఈలోకంలో మిమ్ములను  ప్రేమించక , విశ్వసించక నిజమైన సంతోషమునకు, మీ యొక్క ప్రేమకు, మీ అనుగ్రహాలకు  దూరంగా ఉన్నాము. అటువంటి సందర్భాలలో మమ్ములను క్షమించమని వేడుకుంటున్నాము. ఈలోకం వలె అనేక సార్లు మేము ప్రవర్తిస్తున్నాము. మీకు దూరంగా వెళుతున్నాము. మీరు ఇస్తాను అంటున్నా సంతోషం మాకు దయ చేయండి. ఆ సంతోషం పరిపూర్ణమగునట్లు చేయండి. అప్పడు మీకును తండ్రికిని గల సంబంధం తెలుసుకొనే విధంగా మాకు మీ ప్రేమను తెలియ చేయండి. ప్రభువా! తండ్రి మిమ్ములను ప్రేమించే వారిని ప్రేమిస్తారు అని తెలుపుచున్నారు. మా జీవితంలో ప్రభువా ! ఈ నిజమైన ప్రేమను తెలుసుకొనే భాగ్యం దయ చేయండి.  మేము మిమ్ములను ప్రేమించేలా, విశ్వసించేలా చేసి, తండ్రి ప్రేమను మేము అనుభవించే విధంగా మమ్ము అనుగ్రహించమని వెడుకొనుచున్నాము. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...