యోహాను 16:29-33
అందుకు ఆయన శిష్యులు "ఇప్పుడు మీరు దృష్టాంతములతోకాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు, ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము" అనిరి. అపుడు యేసు "ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా? ఇదిగో ! మీరు నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఎలయన, తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, దైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని" అని చెప్పెను.
ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు ఆయన గురించి తెలుసుకున్నట్లుగా మాటలాడుతున్నారు. వారి పూర్తి విశ్వాసాన్ని వెల్లడిచేస్తున్నారు. ఇక్కడ వీరు ఏమి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుకు మొత్తము తెలుసు అని అంటున్నారు. ఎలా వారు ఇది తెలుసుకోగలిగారు. యేసు ప్రభువుకు శిష్యుల మనసులలో ఏమి ఉన్నదో తెలుసు. అందుకే ఆయన వారు ఏదో ఆయనను అడగదలుచుకున్నారు అని ఆయనే వారితో ఆ మాటలను చెబుతున్నారు. 19 వ వచనంలో. ఇవన్నీ గ్రహించిన శిష్యులు ఆయనే శక్తి ఏమిటి, ఆయనకు ఎలా సమస్తము తెలుసు అని తెలుసుకున్నారు, అంతేకాక వారి మనసులలో ఉన్న భావాలు కూడా ప్రభువుకు తెలుసు అని గ్రహించారు. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని వారు అంటున్నారు. మనం ఏమి అడుగకుండానే మన మనసులో ఉన్న భావం ఆయనకు ఏరుకనే.
ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ? అని యేసు ప్రభువు అడుగుతూ ఎలా వారి విశ్వాసం పరీక్షకు గురి అవుతుందో తెలుపుచున్నారు. మనం దేవుని విశ్వసిస్తున్నాము మనం ఎటువంటి కష్టాలలో కూడా వెనుకడుగేయం అని అనుకుంటూ ఉంటాము. మనకు ఇప్పుడు ఆయన ఎవరో తెలుసు అనుకుంటాం. నిజానికి మనం చాలా బలహీనులం, మన విశ్వాసాన్ని చూపించవలసిన సమయం వచ్చినప్పుడు లేక మనం ఏదైనా పరీక్షకు గురి అయినప్పుడు మన విశ్వాసం ఎంత గట్టిదో తెలుస్తుంది. శిష్యులు యేసు ప్రభువు సర్వజ్ఞుడు అని ఆయనకు అంతా తెలుసని, ఆయన అన్నియు చేయగలడని , సర్వశక్తివంతుడని తెలిసి కూడా ఆయనను వదలి పెట్టి వెళ్లిపోయారు. ఎందుకు ఇలా చేశారు అంటే వారికి నమ్మకం లేక కాదు, వారి జీవితాన్ని పూర్తిగా అర్పించడానకి వారు సిద్దపడలేదు, ఇహపరమైన జీవితంమీద మాత్రమే ఆశ కలిగి ఉండటం వలన.
నేను ఒంటరిగా లేను
యేసు ప్రభువు నేను ఒంటరిగా లేను అని అంటున్నారు. కారణం కూడా ఆయనే చెబుతున్నారు. ఎందుకు శిష్యులు అందరు వదలిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఒంటరిగా ఉండరు అంటే తండ్రి ఆయనతో ఉంటారు. తండ్రి దేవునితో ఆయన ఎప్పుడు కలిసి ఉంటారు. వీరి సంబంధం విడదీయలేనిది. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానకి కూడా వెనుకాడడు, అదే విధముగా తండ్రి కుమారుడు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తాడు. వీరి బంధం శిష్యులు మరియు యేసు ప్రభువుల బంధం లాంటిది కాదు, కాని శిష్యుల యేసు ప్రభువు బంధం కూడా తండ్రికి మరియు యేసు ప్రభువుకు మధ్య ఉన్న బంధంగా దృఢంగా ఉండాలి. యేసు ప్రభువు శిష్యుల గురించి ప్రార్ధించే సమయంలో మరియు ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభువునితో మన బంధం దృఢంగా ఉండాలని , నేను తండ్రి యందును తండ్రి నాయందు ఉన్నట్లు మీరు నాయందు ఉండాలి అని ప్రభువు అడుగుచున్నారు. అప్పుడు మనం కూడా మిగుల ఫలవంతం అవుతాము.
"మీరు కష్టలపాలగుదురు కాని ధైర్యం వహింపుడు. నేను లోకమును జయించితిని." యేసు ప్రభువు తన శిష్యులకు తమ జీవితములో ఎటువంటి కష్టం రాదు అని కాని వారి జీవితం ఈలోకమమున సంతోషకారముగానే ఉంటుంది అని కాని చెప్పలేదు. వీటి అన్ని పొంది కూడా ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించుటకు మనం వీటితోటి పోరాడాలి, అలా కాకుండా ఈ లోకంతో మనం లాలూచీ పడినట్లయితే మనం మనల్ని కోల్పోతాము, మరియు ఈలోకానికి బానిసలుగా మిగిలిపోతాము. అలా కాకుండా యేసు ప్రభువు వలె జీవించినచో మనం ఈ లోకాన్ని జయించవచ్చు. తన శిష్యులు ఎప్పుడుకూడా అధైర్యంగా ఉండకూడదని , అన్ని కష్టాలు ఉన్న కూడా వారు శాంతిని పొందుటకు యేసు ప్రభువు వారికి భరోసా ఇస్తున్నాడు. ఎప్పుడ అయితే శిష్యులు కూడా యేసు ప్రభువు వలె జీవిస్తారో వారి జీవితాలలో కూడా అందరు వదలి వెళ్ళిన వారు క్రుంగిపోరు, దేవుడు వారికి తోడుగా ఉంటారు.
ప్రార్దన : ప్రభువా మీరు సర్వజ్ఞులు అని తెలుసుకున్న శిష్యులు మిమ్ములను ఏమి అడుగకుండానే, మీరు వారి మనసులలో భావాలు తెలుసుకున్నరాని గ్రహించి మీ గొప్పతనం గురించి వెల్లడి చేస్తున్నారు. మేము మీ గురించి పూర్తిగా తెలిసికూడా అనేక సమయాలలో శిష్యుల వలె మాకు వచ్చే భాద్యలు, కష్టాలు చూచి మిమ్ములను వదలి వెళ్ళి పోతున్నాము, అటువంటి పరిస్తితులలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను వదలిపెట్టకుండా , ఎల్లప్పుడు మిమ్ము అంతిపెట్టుకొని జీవించేలా చేయమని వేడుకుంటున్నాము. మిమ్ములను అందరు వదలి పెట్టిన తండ్రి మీకు ఎలా తోడుగా ఉన్నారో మీరు మాకు ఆవిధముగానే తోడుగా ఉండండి. మా జీవితాలలో కూడా అందరు మమ్ములను విడిచిపెట్టె సమయాలలో మీ సాన్నిధ్యం మేము పొందుతూ నిజమైన మీ ఆధారణకు మమ్ములను అర్హులను చేయండి. మీ శాంతి మాకు ఎల్లవేళలా ఉండేలా మమ్ము దీవించి, ఈ మీ వలె మాకు ఈ లోకం మీద విజయాన్ని దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి