యోహను 16:20-23
సువిశేషం: మీరు శోకించి, విలపింతురు. కాని, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు. కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనపడును. కాని, బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇపుడు దుఃఖముతో ఉన్నారు. కాని, నేను మిమ్ము మరల చూచెదను. అపుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడు తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు.
మన జీవితంలో వచ్చిన కొన్ని కష్టమైన సందర్భాలలో అనేకం ఉండవచ్చు. అటువంటి ఒక సందర్భాన్ని మనసు నందు వుంచి ఈ సువిశేష భాగాన్ని ధ్యానిస్తే మనకు ఇది ఎక్కువగా అర్ధం అవడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. మనం దేవుడి మీద నమ్మకంగా ఉన్నమా? లేక మనకు వచ్చిన కష్టానికి మన మీద మనం కోపంగా , దీనంగా ఉన్నమా? , భయంగా ఉన్నమా? ఎందుకు ఇన్ని బాధలు చనిపోవడం మేలు అనుకుంటున్నమా? కొన్ని సార్లు మనకు వచ్చే బాధల్ని తట్టుకోలేక మనల్ని మనం శపించుకుంటాం. కాని ఈ సువిశేషం ద్వారా యేసు ప్రభువు మనలను ఓర్పు కలిగి ఉంటే మీ దుఃఖం , సంతోషంగా మారుతుంది అని చెపుతున్నారు.
యేసు ప్రభువు తన శిష్యులు తమకు ఎటువంటి రోజులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే వారికి వచ్చే కష్టాలు గురించి ముందుగానే చెబుతున్నారు. వారికి శోకించే, విలపించే ,దుఃఖించే సమయం వస్తుంది అని వారిని సిద్ధ పరుస్తున్నారు. అంతే కాదు వారి శోకం , విలాపం , దుఃఖం మారిపోయి ఆనందించే సమయం వారికి రానున్నది అని ప్రభువు వారికి వెల్లడిచేస్తున్నారు. మరలా వారు యేసు ప్రభువును చూసే రోజు వస్తుంది. వారికి ఆనందించే రోజు వస్తుంది అనే భరోసా వారికి ప్రభువు ఇస్తున్నారు. మనం ఆయన సాన్నిధ్యం మరియు ఆయన బహుమానం మనం పొందాలి అంటే మనం ఓర్పుతో వేచి ఉండాలి.
యేసు ప్రభువు ఇక్కడ ఒక ప్రసవ వేదనలో ఉన్న స్త్రీని ఉదాహరణగా చెబుతున్నారు. ఆమె ప్రసవించిన తరువాత తాను పొందిన బాధను, వేదనను మొత్తం మరచిపోతుంది. తాను ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన ఆనందం ఆమెకు ఉంటుంది. ఆ ఆనందం ఆమె పొందిన వేదన కన్నా చాలా గొప్పది. తన జీవితానికి ఒక నూతన అర్ధాన్ని ఇచ్చేది అవుతుంది.
ప్రతి తల్లికి తెలుసు, తన యొక్క వేదన కొద్ది సమయమే కావచ్చు, అది భరించలేనిదిగా ఉండవచ్చు ఆ స్త్రీకి. కాని తరువాత వచ్చే ఆనందము కోసం ఆమె ఆ బాధను భరించడానికి సిద్దంగానే ఉంటుంది.
మన జీవితంలో కూడా ఎటువంటి కష్టం లేకుండా మనకు అన్నీ సమకూరినా , దానిని మనం అనుభవించిన కాని, దాని మాధుర్యం మనం పొందలేము. కాని మన కష్టంతో కూడిన దాని ఫలితముగా మనకు వచ్చే మంచికి మనం ఎక్కువ విలువనిస్తాము. దాని మాధుర్యం గొప్పగా ఉంటుంది.
మనం చేయవలసినది, ఆయన మీద నమ్మకం ఉంచి వేచి ఉండాలి. కాని మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది అంత సులువు కాదు. మనకు మంచి జరుగుతుంది అని మనం నమ్మక పోవచ్చు. మనకు మంచి జరిగే రోజు చాలా దూరం ఉండవచ్చు. ఆయన మీద నమ్మకం ఉంటే మనం ఎంత కాలమైన ఆయన కోసం ఎదురుచూస్తాం. ఆయన మీద మన విశ్వాసం ఎంత గొప్పది అనేది తెలిసేది, మనం ఆయన్ను చూడకుండానే, ఆయన సాన్నిధ్యం పొందకుండానే ఆయన మీద నమ్మకంతో ఎదురు చూడటంలో.
"నేను మిమ్ము మరల చూచెదను అప్పడు మీరు సంతోషింతురు". ఇక్కడ యేసు ప్రభువు నేను మిమ్ము మరలా చూచెదను అని చెబుతున్నారు. ఇది రెండు సందర్భాల గురించి కావచ్చు. తాను మరణాన్ని జయించిన తరువాత ఆయన పునరుత్థాన క్రీస్తు వారిని చూసే సమయం. మరల ఆయన తుది తీర్పు సమయంలో ఆయన మరలా చూడటం గురించి చెబుతున్నారు. యేసు ప్రభువుని చూడటం అంటే మనం ఆనందించే సమయం. ఆయన వారికి ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను ఎల్లప్పుడు మీతో వుంటాను అని చెప్పారు. అంటే మనం ఎల్లప్పుడు ఆనందంగా ఉండవచ్చు. ఆయన సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడు అనుభవించడం మనం నేర్చుకున్నప్పుడ. కనుక క్రీస్తు అనుచరులమైన మనం ఏళ్ళప్పుడు ఆయన సాన్నిధ్యం పొందడం నేర్చుకోవాలి.
ఆయన మనకు ఇస్తాను అని చెప్తున్న సంతోషం శాశ్వతమైనది. దానిని ఎవరు మీ నుండి తీసివేయలేరు అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి ఈ శాశ్వతమైన సంతోషం, ఎందుకు ఎవరు దీనిని మన నుండి తీసివేయలేరు అంటే అది అంతరంగీకమైనది. మన ఈ లోక కష్టాలు, బాధలకు అది అతీతమైనది. నేను రక్షింపబడ్డాను అనే సత్యం తెలుసుకోవడం ద్వారా వచ్చే సంతొషం అది. దాని అర్ధం నేను ఈ లోకంలో ఉండే సమస్యలకు అతీతుడును కాను, కాని ఇది తెలుసుకున్న తరువాత నేను పొందే బాధ, కష్టం నన్ను ఏమి చేయలేదు. ఆ సంతోషం మనకు చాలా ముఖ్యం. పునీతులు ఇటువంటి జీవితంను వారు అనుభవించారు. అందుకే వారు ఎటువంటి కష్టాలు అనుభవించిన, వారి జీవితాలలో ఎప్పుడు సంతోషాన్ని అనుభవించారు. వారి సంతోషాన్ని ఈ కష్టాలు తీసి వేయలేకపోయాయి.
ప్రార్దన : ప్రభువా! నేను నా జీవితంలో వచ్చే కష్టాలకు, బాధలకు క్రుంగి పోతున్నాను. కొన్ని సార్లు నాకు ఎందుకు ఇన్ని కష్టలు అని నన్ను నేను అసహ్యంగా చూస్తున్నాను. మీరు చెప్పిన విధంగా ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాను. అటువంటి సమయాలలో నాకు తోడుగా ఉండి మీకు కోసం ఎదురుచూసే మనసు ఇవ్వండి. నా జీవితంలో వచ్చే కష్టలలో మీ సాన్నిధ్యం పొందే భాగ్యం ఇవ్వండి దాని ద్వార మీరు ఇచ్చే సంతోషాన్ని సదా కాలము నేను పొందగలగుతాను. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి