మత్తయి 7:21,24-27
"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. " నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాది పై నిర్మింపబడుటచే కూలి పోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది."
ధ్యానం: "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. యేసు ప్రభువుని మాటలు జీవమై ఉన్నవి అని మనకు తెలుసు. ఈ ప్రభువు మాటలు ఒకసారి ఆలోచిద్దాం. ప్రభూ ప్రభూ అని నన్ను పదే పదే సంబోధించే వారు పరలోక రాజ్యములో ప్రవేశించారు అని ప్రభువు చెబుతున్నారు. మరి ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి పరలోక మందున్న తండ్రి చిత్తము? దీని కోసము ఎవరు ఎవరు ఏమి చేశారు? ఒక సారి పవిత్ర గ్రంధం పరిశీలించినట్లయితే కుమారుని ఔన్నత్యం ఆయన ఈ తండ్రి చిత్తము నెరవేర్చిన విధానం ద్వారానే తెలుసుకుంటాము. అంతేకాక అనేక మంది ప్రవక్తలు, గొప్ప భక్తులు వారి జీవితాలను, పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అంకితం చేశారు. ఈ విషయంలో కుమారుడు అయిన యేసు ప్రభువు ప్రతి మానవునికి ఆదర్శం అవుతారు.
క్రైస్తవులు ఎక్కువగా ప్రార్ధించే ప్రార్ధన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్దన. ఈ ప్రార్ధనలో , "మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక" అని ప్రార్ధిస్తున్నాము. మరల యేసు ప్రభువు తాను గెత్సమేను తోటలో ఉన్నప్పుడు "తండ్రి నేను పానము చేసిననే తప్ప , నా నుండి తొలగిపోవ సాధ్యము కాని యెడల మీ చిత్తమునే నెరవేరనిమ్ము అని ప్రభువు చెబుతున్నారు. అంతకు ముందుకూడా ప్రభువు అంటున్నారు "ఈ పాత్రను నా నుండి తొలగించు కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరనిమ్ము" అని అంటున్నారు. యేసు ప్రభువుకు తాను ఈ దైవ చిత్తము నెరవేర్చడం అంటే, తాను అనేక కష్టలు పొంది మరణశిక్ష పొందడం అని తెలిసి కూడా, మీ చిత్తమె నెరవేరనిమ్ము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుకు తన తండ్రి చిత్తము నెరవేర్చడమును తన ఆహరంగా మార్చుకున్నారు. అందుకే ఆయన అంత కష్టమైన పనిని కూడా చేస్తున్నారు.
యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని ఎవరు పాటిస్తారో , వారు ఎలా దేవునికి కుటుంబంలో వారు అవుతారో చెబుతారు. అది తెలియజేయడానికి, పరలోక మందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు వాడే , నా సోదరి , సోదరుడు నా తల్లి అని ప్రభువు చెబుతున్నారు. ఈ పసి బాలురలో ఏ ఒకడైన నాశనమగుట మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చువాడే పరలోకమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నాడు. దైవ చిత్తము మన జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఇది మనలను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను సాధిస్తుంది. యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయుట లేదు. మరియమాత తాను దేవుని దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరగాలి అని తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి అర్పిస్తుంది. యోసేపు, తండ్రి ప్రణాళికా జరుగుటకు తన జీవితాన్ని అర్పిస్తున్నారు. మన జీవితాలలో దేవుని ప్రణాళికా తెలుసుకొని అది జరుగుటకు మన వంతు బాధ్యత మనం ఎప్పుడు చెయాలి. అప్పుడు మనం దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాము.
నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువుని మాటలు ఆలకించుట అంటే ఒకడు తన జీవితాన్ని, పరలోకరాజ్యంలో స్థానాన్ని పదిలపరుచుకున్నట్లే. పరలోక రాజ్యం అంటే సకల సౌక్యాల కంటే, సకల సంతోషాల కంటే గొప్పది. అది ఎప్పుడు ఆ ప్రభువుతో కలసి ఉండటము. అది కేవలం ప్రభువుని మాటలను ఆలకించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వారికి మాత్రమే ఉంటుంది. ఒక వేళ యేసు ప్రభువు మాటలను పట్టించుకోకుండా, తండ్రి చిత్తాన్ని చేయకుండా ఉన్నట్లయితే వారు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకున్న వారి వలె ఉంటారు అని ప్రభువు చెబుతున్నారు. ఇసుక మీద కట్టిన ఇల్లు చిన్న కుదుపులను కూడా తట్టుకోలేదు అటువంటిది పెద్ద పెద్ద తుఫానులను ఎలా తట్టుకుంటుంది. యేసు ప్రభువు మాటలను అనుసరించినట్లయితే, వారు యేసు అనే పునాది మీద తమ జీవితాన్ని కట్టుకున్నట్లు, వారు ఎటువంటి కుదుపులకు తొనకరు. మన పునాది క్రీస్తు అని మనం ఎప్పుడు గుర్తించుకొని జీవించాలి.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మీ తండ్రి చిత్తము గురించి, దాని ప్రాముఖ్యతను గురించి చెబుతున్నారు. మీ మాటలను వినమని తండ్రి చెబుతున్నారు. మీరు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మీ ప్రాణమును కూడా త్యాగం చేశారు. ప్రభువా , మీరు తండ్రి చిత్తము చేయుట ఎంత కష్టమైన, అది చేయనని తండ్రికి చెప్పలేదు, వీలైతే దీనిని నా నుండి తొలగించండి అని అడుగుతున్నారు. అప్పటికి నా ఇష్టం కాదు మీ ఇష్టమునే నెరవేరనిమ్ము అని చెబుతున్నారు. ప్రభువా నేను నా జీవితంలో సౌక్యాలు పొందాలని, చిన్న చిన్న ఆనందాల కోసం కూడా తండ్రి చిత్తాన్ని పాటించకుండా ఉన్నాను. అటువంటి పరిస్థితులలో నన్ను క్షమించండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీ వలె ఎల్లప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎటువంటి కష్టమునైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా నన్ను చేయమని, నా జీవితానికి మిమ్ములను పునాదిగా చేసుకునే భాగ్యం నాకు దయచేయండి. ఎల్లప్పుడు తండ్రి చిత్తాన్ని పాటిస్తూ, మీతో పాటు కలిసి జీవించుటకు అర్హతను దయచేయండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి