పేజీలు

28.12.23

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

 మత్తయి 2:13-18 

వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని  ఆదేశించెను. అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు  తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహామందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులందరిని చంపుడని అతను ఆజ్ఞాపించెను.  

ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు.  ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు  వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ  తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా  పుట్టిన శిశువు నక్షత్రం  చూచి, ఆయనను మేము  ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని  వారు  అడిగారు. హెరోదు రాజు తన అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది.  తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.

 "నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత   ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు.  హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం  ఐగుప్తు లోనే ఉంటుంది.  ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు  హెరోదు పరిదిలో లేదు,  అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల  హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది. 

యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.

 అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి  మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి  రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది. 

 "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే,  రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది.  ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది. https://www.daivavaakkudhyaanam.com/2023/06/blog-post.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా!  మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు  ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...