పేజీలు

26.11.22

ఆగమన కాల మొదటి ఆదివారం , మత్తయి 24:37-44

 మత్తయి 24:37-44 

నోవా దినములయందు ఎట్లుండెనో, అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా  ఓడలో  ప్రవేశించు వరకు  జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపోవువరకు వారు ఎట్లు ఎరుగకుండిరో, అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు   పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరియొకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై యుండుడు. ఏలయన, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మేల్కొనియుండి, తన ఇంటికి కన్నము వేయనీయుడు. కనుక, మీరును సిద్ధముగా ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. 

పునీత సిలువ  యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ  మార్గ మధ్యములో  ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది. 

ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను   ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది  స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు. 

 ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము.  నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి.  ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు.  కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు  ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి.  నీ జీవితములో ఆయన లేకుంటే  జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం  పరిపూర్ణత సంతరించుకుంటుంది.   

 ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి  దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు  ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.  

దేవుని రాకడ లేక ఆగమానం  - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము.  ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు,  ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు.  దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.  

  తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత,  మక్కబియుల గ్రంధంలో  వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది. 

ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును  తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '

 యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి  నిత్య రక్షణ ద్వారము మరల  తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన  వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన  ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి. 

 క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న  మనలను ఆనందంతో నింపుతున్నాడు.  అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి.  అంటే మనం  దేవుని వాక్కు అవతరంగా  మారిపోగలగాలి.

19.11.22

క్రీస్తు రాజు మహోత్సవం

క్రీస్తు రాజు మహోత్సవం 

లూకా 23:35-43 

ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించు కొననిమ్ము" అని అధికారులు ఆయనను హేళనచేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి  పిలిసిన ద్రాక్షరసమును ఇచ్చి , "యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము" అని పరిహాసించిరి. "ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి  శిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు గదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము. అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయ పడవా? నీవు కూడ అదే శిక్ష పొందుచున్నావు కదా!మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన  ఏ తప్పిదము  చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, "యేసు!నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను  జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 

ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు  పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు  స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది.   1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది. 

ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే  ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు. 

 యిస్రాయేలీయుల రాజు 

మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు  వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు.  యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.

ఇతర దేశాల రాజులు మరియు రాచరికం 

 పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది.  ఐగుప్తు దేశంలో  ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు.  ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు  భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి  అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు. 

యిస్రాయేలు ప్రజలు రాచరికం 

యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు.  న్యాయాధిపతులు 8:23.  దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత  అబిమలేకు రాజును కావాలనే ఆశతో  షెకెము వద్ద  కానా తరహా రాచరికాన్ని  స్థాపించాలని  చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త  కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త  వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం  సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము  నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని  వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని  యేషయా ప్రవక్త  భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి. 

దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు. 

దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక  రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి  కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు.  అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్  యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు  అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.  

 యిస్రాయేలు ప్రజలలో  దేవుడు వారి రాజు అనె  భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా  ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు. 

తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు  మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం  యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్  రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు. 

 యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి  సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము?  అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి  విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.

ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేడి కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం. 

12.11.22

లూకా 21: 5-19

లూకా 21: 5-19 


కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను  అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్దములను, విప్లవములను గూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతము రాదు" అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను: "ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చేదరు. మీలో కొంత మందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 

కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. యెరుషలేము దేవాలయము గురించి యిస్రాయేలు ప్రజలు ఎప్పుడు చాలా గర్విస్తు ఉండేవారు. ఎందుకంటే అది వారి గొప్ప తనానికి సూచనలా వారు భావించేవారు. అంత పెద్ద కట్టడము యెరుషలేములో మరియొకటి  లేదు.   అది వారు దృష్టిలో ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. కేవలం పెద్ద కట్టడము మాత్రమే కాదు అది వారి విశ్వాసానికి, దేవుని మీద వారికి గల ప్రేమకు కూడా గుర్తు.  దావీదు మహారాజు  దేవునికి ఆలయం లేదు, నేను ఇక్కడ రాజప్రసాదంలో ఉంటున్నాను అని భాధ పడి, దేవాలయం కట్టాలని ఎంతో ఆశ పడ్డాడు. కాని దేవుడు మాత్రము ఆయన చేతులు రక్తం చింధించినవి అని, దేవాలయం ఆయన చేత కట్టనివ్వలేదు. తరువాత దేవాలయమును సోలోమోను చెత కట్టించడం జరిగినది. సోలోమోను కట్టించిన దేవాలయము యొక్క గొప్పతనం మనం వింటూ వుంటాం. ఎక్కడెక్కడి నుండో వారు గొప్ప గొప్ప వాటిని తీసుకొని వచ్చి గొప్ప దేవాలయం నిర్మించడం జరిగినది. కాని అది కట్టిన నాలుగు వందల సంవత్సరాల తరువాత, ఆ దేవాలయం బాబిలోనియా రాజు నెబుకద్నేసరు రాజు దండెత్తి వచ్చినప్పుడు దేవాలయం ద్వంసం చేస్తున్నారు. అక్కడి విలువైన వస్తువులను తీసుకొని పోతున్నారు. 

 బాబిలోనియా ప్రవాసం ముగిసిన పిదప యిస్రాయేలు ప్రజలు మరల దేవాలయం కట్టుకున్నారు, ఎజ్రా, నేహామియా ఈ కార్యానికి పూనుకొని వారు గొప్ప దేవాలయం నిర్మించారు. అయితే ఈ దేవాలయం చాలా సంవత్సరాలు కట్టారు, ఇది పూర్తి అయిన  కొద్ది కాలమునకే ఈ దేవాలయం నాశనం చేయ బడింది. ఈ దేవాలయం కట్టిన తరువాత హెరోదు ఆ దేవాలయముకు ఇంకా ఎక్కువ స్థలంలో దానిని పొడిగించాడు, ఆవిధంగా  ఈ దేవాలయం చాలా సుందరముగా చేశారు. 17 ఎకరాలు ఉన్న దేవాలయాన్ని హెరోదు 36 ఎకరాలకు పెంచడం జరిగింది. చాలా ప్రశస్తమైన రాళ్ళతో దేవాలయం కట్టడం చేయడం జరిగింది, దేవాలయం ముఖగోడ  మొత్తం బంగారం పొందుపరచబడింది, బంగారం లేని చోట తెల్లని పాల రాయితో కట్టడం జరిగింది. ఇది యిస్రాయేలు వైభవానికి, ప్రశస్తికి గుర్తుగా ఉండేది. అటువంటి గొప్ప కట్టడం వారి జీవితాలలో ముఖ్యమైన స్థానం కలిగివుంది. వారి జీవితం మొత్తం  ఆ దేవాలయం చుట్టే తిరిగేది. దేవాలయంలో ఉన్న దేవుని సాన్నిధ్యం కంటే వీరి మనసు దేవాలయం అందం మీదే ఎక్కువగా ఉండేది. అందుకే యేసు ప్రభువు వారిని బలి వస్తువులను పవిత్ర పరిచే బలిపీఠం  గొప్పదా ? లేక బలి పీఠం మీద అర్పించబడిన బంగారం గొప్పదా? అని కొన్ని సార్లు మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఏది గొప్పో నిర్ణయించుకోలేక పోతాము.

అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. ఇంత గొప్ప కట్టడముగా ఉన్న దేవాలయమును యేసు ప్రభువు రాతి మీద రాయి నిలువని రోజు వస్తుంది అని చెబుతున్నారు. ఇది యిస్రాయేలు ప్రజలకు మింగుడు పడని ఒక విషయం ఎందుకు అంటే వారికి కేవలం ఇది ఒక గొప్ప కట్టడం మాత్రమే కాదు, వారి యొక్క సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం. కాని దేవుని అలోచనలు  అర్ధం చేసుకోవడంలో విఫలం చెందారు. కారణం ఏమిటి అంటే వీరి ఆలోచనల ప్రకారం వీరు జీవించారు, ఈ ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన ఏమిటి అంటే దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనకు ఇక ఎవరు ఎదురు ఉండరు, అని గర్వంతో నివసించేవారు, కాని ఇటువంటి ఆలోచన ఉన్న అన్నీ సమయాలలో దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళేవారు, దాని ద్వారా వారు నాశనం చెందేవారు. ఇస్రాయేలు ప్రజలకు వచ్చిన ప్రతి ఆపద, ప్రతి అవమానం, ప్రతి నాశనం కేవలం దేవుడు వారికి దూరం అవ్వడం వలన మాత్రమే జరిగింది. మేము దేవాలయానికి దగ్గర అయ్యాం అనుకుంటున్నాము,  కాని దేవుని నుండి దూరం అయ్యాము ఏమో అని గుర్తించలేక పోతున్నమా? ఇదే ఇస్రాయేలు ప్రజలకు జరిగింది , మనకు కూడా ఇదే జరుగుతుందా ! ఆలోచించాలి. 

అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. ఇటువంటివి జరిగినప్పుడు మోసపోవద్దు అని యేసు ప్రభువు చెబుతున్నారు. మోసపోకుండా ఉండుటకు మనం ఏమి చేయాలి? మోసగాడు చెప్పే మాటలను నమ్మకుండా ఉండుటకు ఏమి చేయాలి? మనం చేయవలనసినది ఒక్కటే ఆయన చెప్పిన విధముగా మనం జీవించాలి. ఆయన సాన్నిధ్యాన్ని మన మనసులలో పొందుటకు ప్రయత్నించాలి. ఆయన వాక్కును అనుసరించి జీవించాలి. మరి ముఖ్యముగా ఆయన వలె వారు జీవిస్తున్నారా అని చూడాలి, యేసు ప్రభువు ఎవరిని మోసం చేయలేదు, యేసు ప్రభువు ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని క్షమించను అనలేదు, ఎవరిని తృణీకరించలేదు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు, ఆయన పగ, ప్రతీకారం తీర్చుకోలేదు, శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రాకులాడలేదు, ఆయన అహంకారిగా ఉండలేదు,  ముఖ్యంగా మనం అంధకారంలో లేకపోతే ఇది తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. 

నా నిమిత్తము మీరు అనేక హింసలకు మీరు గురి అవుతారు , ఇది యేసు ప్రభువును పూర్తిగా మనం అనుసరించడం మొదలుపెట్టినప్పటి నుండి జరుగుతుంది. ఒకసారి మనం క్రైస్తవ చరిత్ర చూసినట్లయితే ఇది మనకు తెలుస్తుంది. స్తేఫాను గారి జీవితం చూసినట్లయితే ఈ విషయం మనకు తెలుస్తుంది. యేసు ప్రభువును అనుసరించడం తప్ప,  అతని జీవితంలో తప్పు ఏమి లేదు కాని ఆయనను అన్ని విధాలుగా పరీక్షకు గురిచేసి, అన్యాయముగా అతనిని హింసించి చంపడం జరిగినది, ఆయన ఏమి మాటలడడో  ఒకసారి గుర్తు చేసుకోండి ఎక్కడ నుండి వచ్చినది ఆ జ్ఞానం కేవలం దేవుని నుండి అందుకే యేసు ప్రభువు చెబుతున్నారు. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. అలా అని అప్పుడే అంతిమ దీనము వచ్చినది అని కాదు అర్ధం. ఇవి అన్నీ జరిగిన తరువాత కాని ఆ దినము రాదు. నిజానికి మనం ఆ దినము గురించి అంతగా ఆలోచించనవసరం లేదు మనం చేయవలసినది, ఎప్పుడు జాగురుకత కలిగి ఉండటం అప్పుడు ఆ రోజు ఎప్పుడు వచ్చిన మనం సిద్ధంగా ఉంటాము. 

నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు మనం  మీ శరీరమును నాశనము చేసే వారికి భయ పడకుడు అని చెప్పిన మాట వలె మనం ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవులను ఒక రకముగా శత్రువులు అన్నట్లుగా చూసారు, హింసించారు, కష్ట పెట్టారు కాని ఎవరు వారి విశ్వాసాన్ని ఏమి చేయలేక పోయారు, అన్నీ కష్టాలు పొందుతూ, హింసకు గురి అవుతూ క్రీస్తుకు సాక్షులుగా జీవించారు, ఎందుకంటె వారి ప్రాణమును వారు నిలబెట్టుకున్నారు. 

సహనం క్రైస్తవులకు ఉండవలసిన ఒక గొప్ప గుణం. ఈ సుగుణం మనలను అన్ని భరించే శక్తిని కలిగేలా చేస్తుంది. మనలను దేవునికి ఇష్టమైన వారిగా మారుస్తుంది. ఒక సారి పునీతుల జీవితాలు పరిశీలించినట్లయితే వారు ఎంత సహనము కలిగి ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు నుండే వారు ఈ సుగుణాన్ని నేర్చుకుంటున్నారు. ఆయనను ఎన్నో అవమానాలుకు గురి చేసిన తన సహనాన్ని కోల్పోకుండా జీవించాడు. హింసలనుకు సహనంతో భరించాడు. సహనం మనలను శక్తి వంతులను చేస్తుంది. కనుక క్రీస్తును అనుసరిస్తూ ఆయన సుగుణాలను అలవరచుకొనుచు , క్రీస్తు సాక్షులుగా జీవించుదాం. ఆమెన్. 
నిజ క్రైస్తవులుగా జీవించుదాం. 



 






5.11.22

లూకా 20: 27-38

 లూకా 20: 27-38 

ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని కొందరు  సద్ధూకయ్యులు  యేసు వద్దకు వచ్చి , బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి. అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవితమున వివాహమునకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు. మండు చున్న పోదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యకొబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని వారికి సమాధానం ఇచ్చెను.

సద్దుకయ్యులు యూద సమాజంలో ఎవరు? ఎలా ఉండేవారు ?

 ఈ సువిశేష భాగంలో కొంత మంది సద్దుకయ్యులు యేసు వద్దకు వచ్చారు, అని మనం వింటున్నాము. ఎవరు ఈ సద్దుకయ్యులు  అని ప్రశ్నించినట్లయితే  ఆనాటి సామాజిక పరిస్తితులను బట్టి వీరు  యూదయ సమాజంలో ఒక ఉన్నత వర్గానికి చెందినవారు. వీరు బైబుల్ లోని మొదటి ఐదు గ్రంధాలను  మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సమరియులవలే వాటిని మాత్రమే విశ్వసించే వారు.  మిగిలిన గ్రంధాలను ఈ మొదటి గ్రంధాల మీద వ్యాక్యానంగా మాత్రమే చూసేవారు. మొదటి గ్రంధాలలో పునరుత్థానం గురించి విపులంగా లేదు, కనుక పునరుత్థానం అంటే నమ్మేవారు కాదు.   

వీరు చాలా ధనికులు అంతే కాకుండా దేవాలయ అధికారం మొత్తం వీరు చేతులలోనే ఉండేది. యూదయా పెద్దల సమాజం అంటే యూదయ న్యాయస్థానం. దీనిలో ఎక్కువ మంది సభ్యులు సద్దుకయ్యులే ఉండేవారు. వీరిని ప్రజలు చాల నిష్ట పరులుగా పరిగణించేవారు కాని పరిసయ్యుల అంత గౌరవాన్ని పొందలేక పోయెవారు. ప్రధాన యాజకులు ఎక్కువ వీరి నుండే వుండే వారు. కైపా అనే ప్రాధాన యాజకుడు కూడా వీరిలోని వాడే. దేవాలయంలో జరిగే అన్ని రకాల వ్యాపారాలు వీరి ఆధీనంలోనే జరిగేవి. దేవాలయంలో జరిగే  డబ్బులు మార్పు కూడా వీరి ద్వారానే జరిగేవి. ఆకాలంలో ఉన్నటువంటి సామాజిక ఆలోచన విధానంగా చూస్తే వీరు లౌకిక వాదులుగానే ఉండేవారు. వీరి దృష్టిలో పునరుత్థానం  అనేది లేదు. దేవదూతలు లేరు, ఈ లోకమే సమస్తం.  

ఒక వ్యక్తి మరణించిన తరువాత ఇంకా ఏమి ఉండదు, అంతటితో వాని జీవితం ముగుస్తుంది అని నమ్మేవారు. అలా అని వీరు, వారి ఇష్టమైన విధంగా ఏమి జీవించేవారు కాదు. ఈ లోకంలో ఉండగా మనం మంచి జీవితం జీవిస్తే, మనలను  దేవుడు ఆశీర్వదిస్తారు అని చాలా మంచి జీవితం జీవించేవారు. కాని వీరి చేసినటువంటి ఒక పాపం ఏమిటి అంటే వీరు  రోమా సామ్రాజ్యానికి ఒక  రకమైన సామంతులుగా ఉండేవారు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా వీరు ఏమి చేసేవారు కాదు. దేవాలయంలో డబ్బులు మార్పుల విషయంలో కూడా వీరు రోమా సామ్రాజ్యానికి ఒక సంధి ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాక యూదయా ప్రజలకు సంబంధించిన విషయాలలో వీరే తీర్పు తీర్చవచ్చు.  న్యాయ స్థానంలో  వీరికి ఒక వ్యక్తికి మరణ తీర్పు విధించే హక్కు మాత్రము లేదు, కనుక వీరికి హక్కులేని  విషయాలు మాత్రమే పిలాతు వద్దకు పంపేవారు మిగిలిన విషయాలలో వీరే తీర్పు తీర్చేవారు. 

సద్దుకయ్యులు  ఎందుకు యేసు ప్రభువును ఇష్టపడలేదు?

పరిసయ్యుల వలె సద్దుకయ్యులు కూడా యేసు ప్రభువును ఇష్ట పడలేదు. యేసు ప్రభువు వారి నమ్మకాలను, వారి వ్యాపారాలను, వారి జీవిత విధానాలను తప్పు పట్టారు అని వారు భావించారు.  యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు అక్కడ ఉన్నటు వంటి డబ్బులు మార్చే వారిని , బలికి పక్షులను, జంతువులను అమ్మేవారిని అక్కడ నుండి పంపించి వేశాడు.  అంతేకాక నా తండ్రి ఆలయాన్ని దొంగల గుహాగా చేసారు అని వారి  తప్పును ఎత్తి చూపాడు. వారి వ్యాపారాన్ని దెబ్బతీశాడు. కనుక వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. ఎలాగైన యేసు ప్రభువును కించ పరచాలని అనుకున్నారు. అనేక విధాలుగా వారు యేసు ప్రభువు మీద కక్ష తీర్చుకోవాలి అనుకున్నారు. యేసు ప్రభువు చనిపోవాలి అని ఎక్కువుగా కోరుకున్నవారు కూడా వీరే. అందరి కోసం ఒకరు మరణించడం మంచిది అని చెప్పింది వీరే.  యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం తెలియదు అని చెప్పాలి అని అనుకున్నారు. ఇప్పుడు మనం చదివిన సువిశేషం సందర్భం యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం మీద మరియు వారి నమ్మకాల మీద పట్టు లేదు అని నిరూపించాలి అనుకున్న సందర్భం. 

పరిసయ్యులకు మరియు సద్దుకయ్యులకు ఉన్న వ్యత్యాసం

పరిసయ్యులు పునరుత్థానమును , దేవదూతలను నమ్ముతారు.  బైబుల్ లోని మొదటి పంచ గ్రంధాలు మాత్రమే కాక చారిత్రక గ్రంధాలు , విజ్ఞాన గ్రంధాలు, కీర్తనలు, ప్రవక్తలు అన్ని గ్రంధాలు  వారు నమ్ముతారు. అంతేకాక పరలోక జీవితం ఉంది అని నమ్ముతారు.  అయితే ఈ పరిసయ్యుల కంటే గొప్ప వారము అనే భావన సద్దుకయ్యులకు ఉండేది. పరిసయ్యుల నమ్మకాల గురించి సద్దుకయ్యులు పరిహాసమాడేవారు. యేసు ప్రభువు పరిసయ్యులను నోరు మూయించాడు అని తెలుసుకొని, మేము ఆయనను పరీక్షించి, ఆయన  మీద కక్ష తీర్చు కోవచ్చు, మరియు పరిసయ్యులు  యేసు ప్రభువును పరీక్షించి విఫలం అయ్యారు కనుక వీరు ఇప్పుడు యేసు ప్రభువును పరీక్షించి పరిసయ్యుల కంటే మేము గొప్ప వారిమి అని ప్రకటించుకోవచ్చు, అనుకున్నారు. మరియు వారి వ్యాపారాలను దెబ్బతీసినందుకు తగిన ప్రతీకారం తీర్చుకోవచ్చు అనుకున్నారు. 

యేసు ప్రభువును పరీక్షించుట   

యేసు ప్రభువును పరీక్షించాలి అని  వారు ఒక కథ అల్లుకున్నారు. అది ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండం 25 వ అధ్యాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నించారు.  "ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి." ఈ  ప్రశ్నను వీరు కేవలం యేసు ప్రభువును అవమానించాలి అనే ఉద్ధేశ్యంతోనే అడిగారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేడని అనుకున్నారు. కాని వారి అమాయకత్వాన్ని, వారికి  ధర్మ శాస్త్రం మీద వున్న  అవగాహన రాహిత్యాన్ని యేసు ప్రభువు ఇక్కడ వెల్లడి చేస్తున్నారు. వారు అనుకుంటున్నట్లుగా వారేమి  అంత తెలివి గలిగినవారో,  లేక ధర్మ శాస్త్ర పరిజ్ఞానం కలిగినవారో,  ఏమి కాదని ప్రభువు ఇక్కడ  తేటతెల్లం చేస్తున్నారు. వీరికి ఉన్న ధనంతో మరియు రోమా సామ్రాజ్యం వీరికి ఇస్తున్న గౌరవంతో, ఇంతకన్నా గొప్ప ఏమి ఉండదు అని వీరు అనుకుంటున్నారు. ఇంతటితోనే జీవితం అనుకున్నారు.

సద్దుకయ్యుల అవివేకం 

యేసు ప్రభువు  వీరిని లేఖనమునలను గాని, దేవుని శక్తినిగాని ఎరుగక  మీరు పొరబడుచున్నారు, అని మత్తయి సువార్త 22: 29 వ వచనంలో చెబుతున్నారు. ఎందుకు వీరు పొరబడుచున్నారో యేసు ప్రభువు చెప్పారు. మొదటిగా వారికి ధర్మ శాస్త్రము అనిన పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే వీరు  ఏనోకును దేవుడు తనతో తీసుకెళ్ళాడు అని నమ్మేవారు. ఏనోకు కయీను కుమారుడు ఆదికాండమునకు సంభందించినవాడు. అంటే ఆయన దేవునితో పాటు ఉన్నాడు అని కూడా వీరు నమ్మరా? అంటే వారి అవివేకం అంతగా పెరిగిపోయింది. అంతే కాదు, మోషేకు దేవుడు మండుచున్న పొదలో సాక్షాత్కారం ఇచ్చినప్పుడు, దేవుడు మోషే ఏమి చేయాలో చెప్పిన తరువాత కూడా ఆయనకు అనేక సందేహాలు ఉన్నాయి.

 మోషే దేవున్ని తన సందేహం తీర్చుకోవడం కోసం, తన ప్రజలకు దేవుని గురించి చెప్పడం కోసం, దేవున్ని ఒక వేళ ప్రజలు  ఆయన ఎవరు ? ఆయన పేరు ఏమిటి ? అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని దేవున్ని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో నేను “ఉన్న వాడను” అని చెబుతున్నాడు. గతంలో ఉన్నవాడను, భవిష్యత్తులో ఉండేవాడను, నిత్యం ఉండేవాడను అని దీని అర్ధం. కాని మనం అనిత్యులం, ఈ రోజు ఉంటాము,  రేపు ఉండము, గతంలో లేము. దేవుడు ఎల్లప్పుడు ఉండేవాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆయన జీవం మనము  జీవిస్తున్నాం. ఈ జీవం మన నుండి పోయినప్పుడు మనం మరణిస్తాము కాని దేవుడు అలా కాదు. ఆయనే జీవం.  దేవుని దృష్టిలో  ఆయనకు అందరు జీవితులే. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను, యకొబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెబుతున్నారు.

 దేవుడు ఎంతో ప్రేమించిన మోషేను, తన ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకురావడానికి వాడుకున్న దేవుడు, మోషే అన్ని కష్టాలు పడి ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకు వచ్చిన మోషే దానిలో అడుగు పెట్టకుండానే చనిపోతున్నాడు. కేవలం ఈ లోకమే సమస్తం అయితే మోషే జీవితానికి అర్ధం ఏముంది.  అటువంటి అప్పుడు సద్దుకయ్యులు నమ్మినట్లుగా మొత్తం ఈ లోకమే అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు తన పని చేసిన వారికి ఇచ్చే బాహుమనం కోసం  పరలోకం ఉండాలి.  అందుకే యేసు ప్రభువు వారికి చెబుతున్నాడు. మీకు దేవుని శక్తి గురించి కాని లేక ధర్మ శాస్త్రం గురించి కాని వారికి అంత అవగాహన లేదు అని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి ప్రశ్న అడగడం వలన యేసు ప్రభువును ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న సద్దుకయ్యుల అవివేకాన్ని వెల్లడిచేసుకున్నారు.

పునరుత్థానములో మానవుని స్థితి 

ఈ సందర్భంగా యేసు ప్రభువు పునరుత్థానం  అయిన తరువాత మానవుని స్థితి ఏమిటి అని తెలియచేస్తున్నాడు. పునరుత్థానాన్ని పరిసయ్యులు నమ్మేవారు కాని వారికి పునరుత్థానం అంటే ఇప్పుడు మనం ఎలా ఈ భౌతిక దేహం కలిగి ఉన్నామో  అలానే భౌతిక దేహాలతో పునరుత్థానం అవుతాము అని అనుకునేవారు. ఒక వేళ ఒక వ్యక్తికి ఏదైనా లోపం ఈ లోకంలో ఉండగా ఉన్నట్లయితే, పునరుత్థానం అయిన తరువాత కూడా అదే లోపంతో ఉంటారు అనే నమ్మకంలో ఉండేవారు. వాటి అన్నింటిని యేసు ప్రభువు తీసివేస్తున్నారు. పునరుత్థానం అయిన తరువాత మనలో ఆ లోపాలు ఏమి ఉండవు అని తెలియచేస్తున్నారు. పునరుత్థానం అయిన వారు దేవదూతల వలె ఉంటారు అని చెబుతున్నారు. దేవదూతలు ఆత్మలు వారికి శరీరం ఉండదు, పునరుత్థానం నందు మనకు ఉండేది ఆధ్యాత్మిక శరీరం, భౌతిక శరీరమునకు ఉన్న అన్ని ఆటంకములు ఈ శరీరమునకు ఉండవు.

పునరుత్థానము నందు పెళ్లి అనేది లేదు. వివాహ ధ్యేయం భార్య భర్తల శ్రేయస్సు, మరియు సంతానం. కాని ఇవి రెండు కూడా పునరుత్థానంలో ఉత్పన్నం కావు ఎందుకంటే, పునరుత్థానములో మనం పరలోకంలో ఉంటాము. దేవుని దగ్గర ఉండుట కంటే శ్రేయస్సు ఏమి లేదు. సంతానం లేక పునరుత్పత్తి అనే సమస్య ఉండదు. అక్కడ మరణం అనేది ఉండదు. సద్దుకయ్యులు అడిగిన ప్రశ్న తప్పు ఎందుకంటే మోషే ఇచ్చిన ఆజ్ఞలో చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం అంతం అయిపోకుండా ఉండటానికి మరల పెళ్లి చేసుకోవాలి అని ఉంది. ద్వితీ 25:6. కాని పునరుత్థానంలో మరణం అనేది ఉత్పన్నం కాదు. 

దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని యేసు ప్రభువు చెబుతున్నారు.  మానవ ఆకాంక్షకు , మరియు ఈ లోకంలో ఉండగా మనం పొందే   కష్టాలకు, బాధలకు, సౌక్యాలకు మన జీవితా నికి అనేక సార్లు పోలిక ఉండదు. ఎందుకు నేను ఇవి అనుభవించాలి అని మనకు అనేక సార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఇన్ని అనుభవిస్తూ   నైతికంగా జీవిస్తున్నాము అంటే ఖచ్ఛితముగా పరలోకం ఉండాలి. వీటి అన్నింటికీ సరియైన విధంగా తీర్పు తీర్చే దేవుడు కావాలి.  కాని మన ఇంటిలో లేక మనకు కావలసిన వారి ఇంటిలో లేక మనం ఎక్కువుగా ప్రేమించిన వారి ఇంటిలో  అకాల మరణం మరణం సంభవించిన ప్రతి సమయంలో మనకు కూడా పునరుత్థానం మీద ప్రశ్న వస్తుంది. నిజముగా ఈ జీవితం ఇంతటితో ఆగిపోయినట్లేనా లేక నేను విశ్వసించే విధముగా దేవుని దగ్గర ఉన్నారా? అని  ఈనాటి సువిశేషం మనకు ఇటువంటి అనుమానాలు అవసరం లేదు అని చెబుతుంది. ఎందుకంటే దేవునికి మృతులు ఎవరు లేరు, అందరు ఆయనకు సజీవులే. ఆయన దృష్టిలో అందరు సజీవులే. యేసు ప్రభువు ఈ మాట చెప్పడం వలన యిస్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు వారు నమ్మిన విషయాలు నిజం అని తెలుసుకుంటున్నారు. మక్కబియుల గ్రంధంలో మనం చూసే ఏడుగురు అన్నదమ్ములు, వారు పునరుత్థానము మీద నమ్మకం ఉంచి అందరు మరణించడానికి సిద్ధ పడ్డారు.

పునరుత్థానం అయిన వారు దేవదూతలతో సమానం మరియు దేవుని కుమారులు అని ప్రభువు చెబుతున్నారు. దేవదూతలతో సమానం అని చెప్పారు కాని దేవదూతలు అని చెప్పలేదు ఎందుకంటే దేవదూతలు దేవుని కుమారులు కాలేరు. అవి కేవలం దేవుని సృష్టిగానే ఉండిపోతారు. మనిషి మాత్రం దేవుని కుమారులు అవుతారు. అందుకే పునీత పౌలు గారు 1 కోరింథీ 6:3 వచనంలో మనము దేవదూతలకు సహితము తీర్పు తీర్చేదము అని చెబుతాడు.

ఈ సువిశేష భాగం ద్వార దేవుడు మానవుని తన పొలికను మాత్రమే ఇవ్వలేదు. తనతో పాటు ఉండుటకు తన వలె జీవించుటకు మరియు తన సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చిఉన్నారు. జీవితం కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినది అని, మనకు ఉన్న సంపదను, అనుగ్రహాలును ఇక్కడ సుఖముగా జీవించుటకు మాత్రమే అని కాక మనకు మరణం తరువాత కూడా జీవితం ఉంది అని తెలుసుకొని , ఎటువంటి అపనమ్మకం లేకుండా జీవించాలి అని తెలియజేస్తుంది. పునరుత్థానం ద్వారా మనం దైవ బిడ్డలము అవుతాము అని తెలుపుతున్నది. మరియు దేవుని దృష్టిలో మృతులు ఎవరు లేరు అందరు ఆయనకు సజీవులే అని ఆయన జీవం గల దేవుడు కనుక మనకు ఆ జీవం ఇస్తారు అని తెలుపుతుంది.

 

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...